: కోర్టులోనే తేల్చుకోండి... విద్యుత్ ఉద్యోగుల వివాదంపై చేతులెత్తేసిన కేంద్రం
తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారిన విద్యుత్ ఉద్యోగుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించడంలో కేంద్రం చేతులెత్తేసింది. నేటి ఉదయం కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల వాదనలు విన్న హోం శాఖ ఉన్నతాధికారులు, వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోండని చెప్పి సమావేశాన్ని ముగించారు. దీంతో వివాదం పరిష్కారం కానుందన్న భావనతో అక్కడికి వెళ్లిన కృష్ణారావు, రాజీశ్ శర్మలు తలలు పట్టుకున్నారు. ఏపీ మూలాలు ఉన్నాయన్న వాదనతో తెలంగాణ సర్కారు పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించి ఏపీకి బదలాయించింది. అయితే ఒకేసారి అంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం తమకు సాధ్యం కాదని ఏపీ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.