: యూపీఏ ప్రభుత్వం సృష్టించిన 'హిందూ టెర్రరిజం' పదంపై రాజ్ నాథ్ తీవ్ర ఆక్షేపణ
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై లోక్ సభలో ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని, రావి నదిని దాటి భారత్ లోకి ప్రవేశించారని వెల్లడించారు. దాడి ఘటనలో ఏడుగురు చనిపోయారని తెలిపారు. గతంలో అనేక చొరబాటు ప్రయత్నాలు జరిగినప్పటికీ భద్రతా దళాలు నిలువరించాయని, కానీ ఈసారి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు రావి నదిని ఎంచుకున్నారని వివరించారు. గురుదాస్ పూర్ దాడిని పార్లమెంటులో ముక్తకంఠంతో ఖండించడం చాలా ముఖ్యమన్నారు. ఉగ్రవాదమనేది ఉగ్రవాదమేనని... దానికి మతం, కులం ఉండవని రాజ్ నాథ్ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదంపై భారత్, పార్లమెంట్ లు విడిపోయినట్టు కనిపించకూడదన్నారు. 'హిందూ టెర్రరిజం' అంటూ గత యూపీఏ ప్రభుత్వం కొత్త పదాన్ని సృష్టించడం ఉగ్రవాదంపై దేశ వైఖరిని బలహీనపరుస్తోందన్నారు. గురుదాస్ పూర్ ఘటన సహా అన్ని విషయాలపై పార్లమెంటులో చర్చించేందుకు తాము సిద్ధమేనని మంత్రి పునరుద్ఘాటించారు.