: ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన నలుగురిలో ఇద్దరు తెలుగువారు
లిబియాలోని ట్రిపోలీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన నలుగురు భారతీయుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ట్రిపోలీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాదుకు చెందిన గోపీకృష్ణ, శ్రీకాకుళానికి చెందిన బలరాం ఉన్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. మిగతావారిలో ఒకరు రాయచూరు, మరొకరు బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారని, వీరిలో ముగ్గురు యూనివర్శిటీ ఆఫ్ సిథ్ లో ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారని, మరొకరు జుఫ్రాలోని వర్శిటీ శాఖలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీరంతా ఇండియాకు తిరిగొచ్చే నిమిత్తం విమానాశ్రయానికి వెళుతుంటే, ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకొని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. వీరు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, వీరిని అపహరించడం వెనక ఉగ్రవాదుల ఉద్దేశమేంటో కూడా తెలియదని ఆయన అన్నారు. భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా వందల సంఖ్యలో ఇండియన్స్ అక్కడే ఉన్నారు.