: ఏపీ ట్రిపుల్ ఐటీకి కలాం పేరు!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ప్రతిపాదిత ట్రిపుల్ ఐటీకి మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం పేరు పెట్టాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగగా, కలాం పేరు భావి తరాలకు గుర్తుండిపోయేలా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు కోరారు. యువత, విద్యార్థులకు ప్రేరణ కలిగించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ప్రభుత్వం తరపున అందించే ప్రతిభా పురస్కారాలకు కలాం పేరును పెట్టాలని కూడా మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ సలహాలపై సానుకూలంగా స్పందించిన సీఎం, త్వరలోనే నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన వెలువరిద్దామని అన్నట్టు సమాచారం.