: నేడు గురుపౌర్ణమి... ఇలా చేస్తే పుణ్యం, పురుషార్థం!


నేడు గురుపౌర్ణమి. మహర్షి వేద వ్యాసుని పుట్టిన రోజు. అందుకే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస పౌర్ణమిని ఆదిశంకరాచార్యుల వారు తొలిసారిగా నిర్వహించినట్టు చెబుతారు. మానవ జీవితంలో గురువుకు ఉన్న ప్రాధాన్యతను గమనించే తల్లిదండ్రుల తరువాత 'ఆచార్య దేవోభవ' అని అన్నారు. షిరిడీలో సాయిబాబా తన భక్తులకు తొలిసారిగా ఉపదేశమిచ్చిన రోజు కూడా ఇదే. ఎంతో పవిత్రమైన దినం. గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ రోజు గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. దీంతో పాటు శక్తి కొద్దీ నైవేధ్యాలను సిద్ధం చేసుకుని దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి, సాయిబాబా పటాలు, ప్రతిమలను పూజిస్తే మేలు కలుగుతుంది. గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలన్న నిబంధన ఉంది. ఉత్తరం వైపు తిరిగి ఐదు దూది వత్తులతో పంచహారతులు ఇవ్వాలని, దానికన్నా ముందు దత్త స్తోత్రాలు పఠించాలని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News