: రూ. 33 వేలున్న బంగారం ధర రూ. 23 వేలకు ఎందుకు తగ్గిందంటే!


ఆగస్టు 2013, అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం... పది గ్రాముల బంగారం ధర రూ. 33 వేల వద్ద ఉంది. ఆ సమయంలో పుత్తడి కొనుగోళ్లు సైతం బాగా పెరిగాయి. మరో రెండేళ్లలో ఈ ధర రూ. 50 వేలకు చేరవచ్చని నిపుణులు అంచనాలు వేశారు కూడా. కానీ, వాస్తవానికి జరిగింది వేరొకటి. ధర పెరగలేదు సరికదా, నేల చూపులు చూస్తూ దిగొచ్చింది. రెండేళ్ల క్రితం స్థాయితో పోలిస్తే రూ. 10 వేల వరకూ తగ్గింది. ప్రస్తుతం ఆభరణాల బంగారం ధర వివిధ ప్రాంతాల్లో రూ. 23 వేల నుంచి రూ. 24 వేల మధ్య కొనసాగుతోంది. 2008లో యూఎస్ లోని లీమన్ బ్రదర్స్ దివాలాతో మొదలైన ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని గడగడలాడిస్తే, స్టాక్ మార్కెట్ పెట్టుబడులన్నీ బులియన్ వైపు పరుగులు పెట్టాయి. అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో 1000 డాలర్ల వద్ద ఉన్న ట్రాయ్ ఔన్సు (31.1 గ్రాములు) ధర 1900 డాలర్లకు పెరిగింది. బంగారం ధరల పెరుగుదల దాదాపు ఐదేళ్లు కొనసాగింది. ఆ తరువాత పరిస్థితులు మారాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం మొదలైంది. దీంతో బులియన్ మార్కెట్ ఒత్తిడికి గురై ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక్క బంగారమే కాదు, అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో ముడిచమురు, స్టీలు, వెండి ఇలా అన్ని లోహాల ధరలు దిగొచ్చాయి. గ్రీస్, ఇరాన్ దేశాల్లో సంక్షోభాలు పెరుగుతాయని, బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని విశ్లేషకులు భావించగా, ఆ సమస్యలు పరిష్కరించబడటం బులియన్ సెంటిమెంటుకు అడ్డు పడింది. ఇదే సమయంలో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ బలపడి, వివిధ దేశాల మారకపు విలువలతో డాలర్ పెరగడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందని వస్తున్న వార్తలు బంగారాన్ని కొనేవాళ్లను లేకుండా చేశాయి. ప్రపంచంలో అత్యధికంగా గోల్డ్ కొని పెట్టుకునే దేశాల్లో ఒకటైన చైనాలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా ఒత్తిడి వచ్చింది. ఇండియా విషయంలో బంగారం కొనుగోలుకు ప్రజలు రావట్లేదు. మరింతగా ధరలు తగ్గుతాయని భావిస్తుండటం, గత రెండు మూడు నెలలుగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం ఇందుకు కారణం. అందువల్లే ధరలు దిగొచ్చాయి.

  • Loading...

More Telugu News