: యాకుబ్ చివరి కోరిక తీరలేదట... చివరికి కూతురితో ఫోన్ సంభాషణతో సరిపెట్టుకున్న వైనం
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ కు నిన్న నాగ్ పూర్ జైలు అధికారులు ఉరి శిక్ష అమలు చేశారు. అయితే అతడి చివరి కోరిక మాత్రం తీరలేదట. చనిపోయే ముందు తన కూతురు జుబేదియాను చూడాలని ఉందని మెమన్ తన చివరి కోరికను జైలు అధికారులకు తెలిపాడట. ఇక నిన్న తెల్లవారుజామున జైలు వద్దకు అతడి కుటుంబ సభ్యులు వచ్చారని, యాకుబ్ తో అతడి కూతురు మాట్లాడిందని వార్తలు వినిపించాయి. అయితే వాస్తవానికి నిన్న జైలు వద్దకు యాకుబ్ సోదరులు మాత్రమే వచ్చారు. అతడి కూతురు ముంబైలోనే ఉండిపోయింది. అనివార్య కారణాల వల్ల జుబేదియాను చూసే భాగ్యం యాకుబ్ కు కలగలేదు. అయితే, ఆమెతో ఫోనులో మాట్లాడే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు. దీంతో ఉరికంబమెక్కేముందు తన కూతురితో యాకుబ్ ఫోన్ లో మాట్లాడి సంతృప్తి పడ్డాడు.