: రైతుల కోసం సినీ తారలను రంగంలోకి దింపుతున్న కన్నడ కాంగ్రెస్
కర్ణాటకలో వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండడంతో సర్కారు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఏం చేస్తే రైతుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుందా? అని యోచించిన అధికార కాంగ్రెస్ పెద్దలకు సినీతారలు ఆశాకిరణాల్లా కనిపించారు. సినీ తారలకు ప్రజల్లో బాగా క్రేజ్ ఉంటుందన్న విషయం గుర్తెరిగిన సర్కారు తమ పార్టీలో ఉన్న తారలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. తాజాగా, మాజీ ఎంపీ రమ్య మాండ్యా జిల్లాలో రైతులను పరామర్శించారు. నష్టాలపాలైన అక్కడి రైతులను ఆమె ఓదార్చే ప్రయత్నం చేశారు. తనవంతుగా కొంత ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె పర్యటనతో పార్టీ వర్గాల్లో కాస్త ఉత్సాహం వచ్చింది. రమ్య బాటలోనే రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, జవహర్ బాలభవన్ చైర్ పర్సన్ భావనలను రైతుల వద్దకు పంపాలని కాంగ్రెస్ తలపోస్తోంది. అంబరీష్, ఉమాశ్రీ, భావన కన్నడ చిత్రసీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే!