: సల్మాన్, ఒవైసీలను కూడా ఉరితీయాలి!: మధ్యప్రదేశ్ 'ఫైర్ బ్రాండ్' ఉషా ఠాకూర్
మధ్యప్రదేశ్ 'ఫైర్ బ్రాండ్'గా పేరుగాంచిన బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలను కూడా యాకూబ్ మెమన్ తరహాలోనే ఉరితీయాలని అన్నారు. యాకూబ్ కు ఉరిపై మీడియా ఆమె స్పందన కోరగా, పైవిధంగా వ్యాఖ్యానించారు. యాకూబ్ ఉరిశిక్ష విషయంలో సల్మాన్ ట్వీట్లు, ఒవైసీ ప్రకటనలపై ఆమె మండిపడ్డారు. వారి అభిప్రాయాలు రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ఏ విషయంపై అయినా ఘాటుగా స్పందించడం ఈ ఇండోర్ ఎమ్మెల్యేకి అలవాటే. ఇంతకుముందు, హిందువులు జరుపుకునే గర్బా వేడుకల్లో ముస్లింలను అనుమతించరాదని వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో వారికి ప్రవేశం కల్పించడం కారణంగా ప్రతి ఏడాది నలుగురైదుగురు హిందూ అమ్మాయిలు మతాంతర వివాహాలకు సిద్ధపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత, మ్యాగీ నిషేధంపైనా తనదైన శైలిలో స్పందించారు. ఆధునికతరం మహిళలు సోమరిపోతుల్లా తయారయ్యారని, పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం వండిపెట్టేందుకు బదులు మ్యాగీ వంటి జంక్ ఫుడ్ పై ఆధారపడుతున్నారని అన్నారు.