: పూరీ జగన్నాథుడికి చల్ల చల్లగా...!
ఒడిశాలోని పూరీ క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైనది. ఇక్కడ కొలువై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే పుణ్యప్రదమన్నది భక్తుల నమ్మిక. రోజూ వేలమంది దర్శించుకుంటారా దేవదేవుడిని. అయితే, భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయంలో ఉక్కపోత పరిస్థితి నెలకొనడాన్ని అధికారులు గుర్తించారు. అందుకే, గర్భగుడిలో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్ ఈ ఆలయంలో ఎయిర్ కూలింగ్ వ్యవస్థను నెలకొల్పింది. 2010లో ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయగా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తిరస్కరించింది. ఏసీ వ్యవస్థ ఏర్పాటుతో గర్భగుడి గోడలు దెబ్బతింటాయని పేర్కొంది. దాంతో, గోడలకు నష్టం వాటిల్లకుండా, వాతావరణాన్ని చల్లబరిచే వ్యవస్థ ఏర్పాటుకు నిపుణుల సలహా తీసుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎయిర్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పురాతన కట్టడమని, అందుకే తాము ఎయిర్ కూలింగ్ వ్యవస్థ వైపు మొగ్గుచూపామని ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సురేశ్ మహాపాత్ర తెలిపారు. ఓ పెద్ద పైపు ద్వారా గర్భగుడిలోకి శీతల వాయువు వస్తుందని వివరించారు.