: ఒకే ఒక్క నిమిషంలో కారును దొంగిలించిన చోరాగ్రేసరుడు!
ఓ లాక్ చేసిన కారును దొంగిలించేందుకు ఎంత సమయం పడుతుంది? ఏమో మాకేం తెలుసు... మేమేమైనా దొంగలమా? అని ఎదురు ప్రశ్న వేస్తారా? అయితే సరే... పార్కింగులో ఉన్న ఓ కారును దొంగిలించేందుకు మధ్యప్రదేశ్ లోని ఓ చోరాగ్రేసరుడికి కేవలం ఒకటంటే ఒక్క నిమిషమే పట్టింది. ఈ ఉదంతమంతా సీసీటీవీలో నిక్షిప్తమైంది కూడా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్ లోని స్వప్న సంగీత రహదారిపై ఈ ఘటన జరిగింది. నరేష్ రఘువంశీ అనే వ్యక్తి రోడ్డు పక్కన తన కారు పెట్టి ఆఫీసుకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేవరకు కారు లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సీసీటీవీలను పరిశీలించి అవాక్కయ్యారు. ఓ రెయిన్ కోటు ధరించిన వ్యక్తి కారు వద్దకు వచ్చి ఒక్క నిమిషంలో దాన్ని చక్కా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఆ కారులో రూ. 70 వేల నగదు, ఓ ల్యాప్ టాప్, విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయని బాధితుడు వాపోయాడు. కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు త్వరలోనే దొంగను పట్టుకుంటామని తెలిపారు.