: ఒక మరణం ఉగ్రవాదాన్ని ఆపేనా?


ఓ తంతు పూర్తయింది. 1993 నాటి ముంబై పేలుళ్ల ఘటనలో ముఖ్యమైన నిందితుల మాటెలావున్నా, తమకు పట్టుబడిన (లొంగిపోయిన?) యాకూబ్ మెమన్ ను ఉరికంబం ఎక్కించి ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీలు చేతులు దులుపుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదానికి ఇదేనా సమాధానం? అని సామాజిక ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. మెమన్ అసలు దోషి కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన వెనక పెద్ద కుట్ర ఉందనీ తెలుసు. అసలు దోషులను చట్టం ముందు నిలపలేకపోయారనీ తెలుసు. వారు ఇంకో కుట్రకు పాల్పడవచ్చని కూడా తెలుసు. అయినా, మెమన్ కు ఉరి సరైనదే. 250 మందికి పైగా పొట్టనబెట్టుకున్న మారణకాండ వెనుక ఆయన హస్తమూ ఉంది. "కోర్టు విచారణను ఎదుర్కొన్న యాకూబ్ కు, పాకిస్థాన్ లో దాగున్న ఇతర దోషులకు మధ్య తేడా ఉంది. దాన్ని మనం గుర్తించాలి. భారత ప్రభుత్వంతో ఓ ఒప్పందానికి వచ్చిన తరవాతనే మెమన్ ఇండియాకు తిరిగచ్చాడని 'రా' (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ అధికారి బీ రామన్ రాసిన ఓ ఆర్టికల్ లోని విషయాల సంగతేంటి?" అని సీపీఐ-ఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు తనకు అసంతృప్తిని కలిగించిందని సామాజిక ఉద్యమ కార్యకర్త జాన్ దయాళ్ అన్నారు. "మరణదండనను నేనెప్పుడూ వ్యతిరేకిస్తాను. ఉరిశిక్ష ఉగ్రవాదుల్లో మార్పును తీసుకొస్తుందా? టీవీ చానళ్లలో వార్తలను చూసి నేను సిగ్గుపడుతున్నా. 1984, 1993, 2002, 2008, 2014లో ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ఇప్పుడు న్యాయం జరిగినట్టు భావించాలా?" అని దయాల్ ప్రశ్నించారు. ఇండియాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ వంటి వారిని హత్య చేసిన దోషులకు ఇప్పటికీ శిక్షలు పడలేదని గుర్తు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, మెమన్ కు రాజకీయ నేపథ్యం లేకపోవడంతోనే ఉరి శిక్ష పడిందని విమర్శించారు. "కేవలం ఒక్క వ్యక్తిని ఉరితీసినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు" అని 'హ్యాంగ్ ఉమెన్' పేరిట పుస్తకం రాసిన రచయిత్రి కేఆర్ మీరా వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా ఉగ్రవాదుల పట్ల భారత వైఖరి మరోసారి ప్రపంచానికి తేటతెల్లమైంది. ఈ శిక్షతో ఉగ్రవాదాన్ని ఆపలేకపోయినప్పటికీ, తమ చర్యలతో అమాయక ప్రాణాలను బలిగొంటే, ఆపై జరిగే పరిణామాలు ఎటువంటి శిక్షకు దారితీస్తాయో చాటి చెప్పేందుకు మెమన్ ఉదంతమే ఓ పెద్ద ఉదాహరణ.

  • Loading...

More Telugu News