: హైదరాబాద్ పై హక్కు మనదే, టీఆర్ఎస్ ఏం చేసింది?: చంద్రబాబు సూటి ప్రశ్న
హైదరాబాద్ కు టీఆర్ఎస్ ఏం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సచివాలయంలో నిన్న తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశమైన ఆయన, "మనల్ని విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు ఎక్కడిది?" అని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశానిదేనని స్పష్టం చేసిన ఆయన, టీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేసిన ఆయన, ఇక్కడ కిలో బియ్యాన్ని రూ. 2కు అందించి ఆహార భద్రత ఆయన కల్పించారని, చేసిన మంచి పనులను గర్వంగా చెప్పాలని చంద్రబాబు అన్నారు. హైదరాబాదులో జరిగిన అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని తెలిపారు. ఈ నగరం గురించి ఇతర పార్టీలకు మాట్లాడే హక్కు లేదని, పార్టీ చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఎస్-టీడీపీ నేతలకు సూచించారు.