: సోషల్ మీడియాపై ‘ఖాకీ’ల డేగ కన్ను... ‘మహా’ పోలీసులకు సెలవులు రద్దు
ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు డేగ కన్నేశారు. వేగంగా సమాచారం విశ్వవ్యాప్తమవుతున్న నేపథ్యంలో యాకుబ్ ఉరి శిక్షను నిరసిస్తూ వ్యాఖ్యలు వెల్లువెత్తే ప్రమాదముందని భావిస్తున్న పోలీసులు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు ఉరి శిక్ష అమలైన నాగ్ పూర్, మహారాష్ట్ర రాజధాని ముంబైల్లో పోలీసుల భద్రత మరింత పెరిగింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులకు సెలవులను రద్దు చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.