: బెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ స్థాయి నుంచి ఉరికంబం వరకు యాకుబ్ మెమన్ ప్రస్థానం!
1993 మార్చ్ 12న బొంబాయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచం షాక్ కు గురైంది. అప్పటి వరకు చిన్నా చితకా బాంబు దాడులను చూడ్డమే కాని, వరుస బాంబు పేలుళ్లు ఎంత దారుణంగా ఉంటాయో చూడటం యావత్ ప్రపంచానికి అదే తొలిసారి. ఐఎస్ఐ అండతో దావూద్ ఇబ్రహీం, టైగన్ మెమన్, యాకుబ్ మెమన్ లు జరిపిన ఈ మారణహోమంలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 713 మంది క్షతగాత్రులయ్యారు. ఈ దాడుల్లో మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన యాకుబ్ మెమన్ జులై 30, 1962లో ముంబైలో జన్మించాడు. ఉన్నత విద్యను అభ్యసించిన యాకుబ్ 1990లో చార్టర్ట్ అకౌంటెన్సీ పూర్తి చేశాడు. 1991లో తన చిన్ననాటి మిత్రుడు చేతన్ మెహతాతో కలసి 'మెహతా అండ్ మెమన్ అసోసియేట్స్' పేరుతో చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ ను స్థాపించాడు. ఏడాది తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన తండ్రి పేరు మీద 'ఏఆర్ అండ్ సన్స్' పేరుతో మరో అకౌంటెన్సీ ఫర్మ్ స్థాపించాడు. అనంతరం చార్టర్డ్ అకౌంటెంట్ గా యాకుబ్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. 'బెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ముంబైలోని మెమన్ కమ్యూనిటీ నుంచి అందుకున్నాడు. దీనికితోడు, 'తేజ్ రాత్ ఇంటర్నేషనల్' పేరుతో ఒక ఎక్స్ పోర్ట్ కంపెనీని ఆయన స్థాపించాడు. పర్షియన్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఈ సంస్థ ద్వారా మాంసాన్ని ఎగుమతి చేసేవాడు. అంతా బాగా జరుగుతూ, సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో... బొంబాయి వరుస బాంబు పేలుళ్లలో మెమన్ కూడా పాలు పంచుకున్నాడు. తన సోదరుడు టైగర్ మెమన్ కు యాకుబ్ మెమన్ ఆర్థిక వనరులను చేకూర్చే వాడని అధికారిక సమాచారం. అదే విధంగా, బాంబు దాడులకు సంబంధించి ప్లానింగ్, ఆచరణ వంటి విషయాల్లో దావూద్ ఇబ్రహీంకు సహకరించాడని భారత అధికారులు వెల్లడించారు. పేలుళ్లు జరిగిన అనంతరం వీరంతా భారత్ ను వదిలి పాకిస్థాన్ వెళ్లిపోయారు. పాక్ లో వ్యాపారాలు చేశారు. ఒకానొక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, పాక్ లో రియలెస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని యాకుబ్ మెమన్ తెలిపాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో రెండు కథనాలు వినిపిస్తుంటాయి. 1994 ఆగస్ట్ 5వ తేదీన న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మెమన్ ను అరెస్ట్ చేశామని సీబీఐ చెప్పింది. ఇదే సమయంలో, 1994 జులై 28వ తేదీన నేపాల్ లో తానే సీబీఐకి లొంగిపోయానని మెమన్ తెలిపాడు. ఈ విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ, ఈ కేసును విచారించిన టాడా కోర్టు 2007 జులై 27న యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఇతర ప్రధాన నిందితులైన దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ లు మాత్రం పాకిస్థాన్ లోనే హాయిగా ఉన్నారు. ఆ తర్వాత, తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ మెమన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కేసును విచారించిన సుప్రీంకోర్టు... వరుస పేలుళ్ల ఘటనలో యాకుబ్ పాత్ర ఉందని నిర్ధారించి, టాడా కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. 2013 మార్చి 21న సుప్రీంకోర్టు మెమన్ కు ఉరిశిక్షను ఖరారు చేసింది. దాడులకు సంబంధించి మెమన్ పాత్ర 'మాస్టర్ మైండ్స్-నిందితుల' మధ్య కోఆర్డినేషన్ కే పరిమితం కాలేదని... పేలుడు పదార్థాలను తరలించడం, సురక్షిత ప్రదేశంలో ఉంచడం లాంటి వాటిలో కూడా మెమన్ పాత్ర ఉందని స్పష్టం చేసింది. దీనికి తోడు, బాంబు పేలుళ్లను నిర్వహించడానికి అవసరమైన డబ్బును తరలించిన హవాలా కార్యకలాపాల్లో కూడా యాకుబ్ పాలుపంచుకున్నాడని తెలిపింది. ముంబై బాంబు పేలుళ్లలో అసలైన మాస్టర్ మైండ్, డ్రైవింగ్ ఫోర్స్ యాకుబే అని జడ్జిలు అంటారు. అయితే, తాను అమాయకుడిని అంటూ యాకుబ్ చెబుతాడు. ఆ తర్వాత, మెమన్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను 2013 జులై 30న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టి వేసింది. అనంతరం మెమన్ పెట్టుకున్న మరో రిట్ పిటిషన్ ను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆ తర్వాత మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఏప్రిల్ 11న తిరస్కరించారు. అనంతరం ఉరిశిక్షపై తన వాదనలను ఛాంబర్ లో కాకుండా, ఓపెన్ కోర్టులో వినాలంటూ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షపై స్టే విధించింది. ఆ తర్వాత 2015 ఏప్రిల్ 9న మెమన్ రివ్యూ పిటిషన్ ను కొట్టేసింది. అనంతరం ఈ నెల 30వ తేదీన మెమన్ ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో న్యాయమూర్తి డెత్ వారంట్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను ఈనెల 29వ తేదీన సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. మరోవైపు మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను మహారాష్ట్ర గవర్నర్ కూడా తిరస్కరించారు. అదేవిధంగా రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. తన ఉరిశిక్షను 14 రోజుల పాటు నిలిపివేయాల్సిందిగా కోరుతూ, చివరి ప్రయత్నంగా నిన్న అర్ధరాత్రి సుప్రీంకోర్టును వేడుకున్నప్పటికీ, ఆ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. దీంతో, యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష తప్పలేదు. ఉన్నత విద్యలు చదివి అనతి కాలంలోనే మంచి పేరు, డబ్బు సంపాదించుకున్న మెమన్... పాక్ కు చెందిన ఐఎస్ఐ ఉచ్చులో పడి, చెడుదారి పట్టి, బాంబు పేలుళ్లలో పాలుపంచుకుని, చివరకు ప్రాణాలనే కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. మరో విషయం ఏమిటంటే, జులై 30 (ఈరోజు) యాకుబ్ మెమన్ పుట్టిన రోజు... మరణించిన రోజు కూడా అదే కావడం యాదృచ్ఛికమే !