: కలాం కాలంలో జీవించామని గర్వంగా చెప్పుకుంటాం: రజనీకాంత్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూయడంతో ఆయన స్వరాష్ట్రం తమిళనాడులో విషాదఛాయలు అలముకున్నాయి. కలాం మృతికి తమిళ సినీ స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన రజనీకాంత్... కలాం కాలంలో జీవించడం తన అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. గాంధీజీ, కామరాజ్, భారతీయార్ వంటి మహనీయులను చూసే భాగ్యం దక్కలేదని, కానీ, కలాం జీవించిన కాలంలో మేం కూడా జీవించామని గర్వంగా చెప్పుకుంటామని ట్వీట్ చేశారు. ఆయన తన సామాన్య జీవన విధానంతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని రజనీ కొనియాడారు. విద్యార్థి సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కలాం ఎంతో కృషి చేశారని, భగవంతుడు ఆయనను నిశ్శబ్దంగా తనలో ఐక్యం చేసుకున్నాడని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా కలాం మృతికి సంతాపం తెలిపారు. కలాంకు వినయం, విధేయత ఆభరణాలు అని కీర్తించారు.