: కీసర మహిళా వసతి గృహానికి ప్రత్యూష తరలింపు
చిన్న వయసులోనే ఎన్నో బాధలనుభవించిన ప్రత్యూష ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతోంది. ఇక నుంచి ఆమెకు తెలంగాణ ప్రభుత్వమే అన్ని రకాలుగా రక్షణ వహించనుంది. ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను కొద్దిసేపటి కిందట అధికారులు కీసరలోని మహిళా వసతి గృహానికి తరలించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి తీసుకురాగా భోజనం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే కేసీఆర్ ఆమెకు సంపూర్ణ భరోసా ఇచ్చారు. తన ఇంటికి ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. అంతేగాక తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆమె చదువు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని ఉపముఖ్యమంత్రి కడియం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీలను సీఎం ఆదేశించారు. సీఎం సహాయ నిధి నుంచి ప్రత్యూషకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నామని, ఆమె పేరుతో బ్యాంకు ఖాతా తెరచి ఆ మొత్తం జమచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీతో ప్రత్యూష చాలా సంతోషపడింది.