: భారతీయ సినిమా అతనిని పాకిస్థాన్ సెలబ్రిటీగా మార్చేసింది
జీవితం ఎవరిని ఏ తీరాలకు చేరుస్తుందో చెప్పడం కాస్త కష్టమే. నిన్నటి వరకు సాధారణ జర్నలిస్టుగా జీవితం గడిపిన వ్యక్తిని భారతీయ సినిమా పాకిస్థాన్ లో సెలబ్రిటీగా మార్చేసింది. సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'భజరంగీ భాయ్ జాన్'లో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన పాత్ర 'చాంద్ నవాబ్' కు స్పూర్తి పాకిస్థాన్ జర్నలిస్టు చాంద్ నవాబ్. పాకిస్థాన్ లోని కరాచీ రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకల వివరాలను చాంద్ నవాబ్ 'పీ టూ సీ' (పీస్ టు కెమేరా) పేరిట చెప్పేవాడు. అలా చెబుతుండగా చాలా మంది కెమెరాలో కనబడాలని అడ్డం వచ్చేవారు. అలాంటప్పుడు ఆయన వారిపై విరుచుకుపడేవాడు. ఇంకొందరికి సర్ది చెప్పేవాడు. మరి కొందర్ని అదిలించేవాడు. దీనిని అతని స్నేహితులు వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో 2008 డిసెంబర్ 8న అప్ లోడ్ చేశారు. ఆ వీడియోకి మంచి ఆదరణ లభించింది, చాలా మందికి నవ్వులు పంచింది. దీనిని స్పూర్తిగా తీసుకున్న కబీర్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్'లో చాంద్ నవాబ్ పాత్రను పెట్టారు. ఈ పాత్ర పాకిస్థాన్ లో చాంద్ నవాబ్ కు విపరీతమైన పేరుప్రతిష్ఠలు తీసుకొచ్చింది. ఇప్పుడు చాంద్ నవాబ్ అక్కడ సెలబ్రిటీగా మారాడు. ఆయనతో సెల్పీ తీసుకునేందుకు స్ధానికులు పొటీ పడుతున్నారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకునేందుకు స్థానిక, జాతీయ ఛానెళ్లు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో తనను సెలబ్రిటీని చేసిన సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ కు చాంద్ నవాబ్ ధన్యవాదాలు తెలిపాడు. వారిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కూడా ఇచ్చారని, వారు తనకు కొంత డబ్బు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు.