: కలాంకు, ప్రతిభా పాటిల్ కు ఎంత తేడా?
అబ్దుల్ కలాం తన వ్యక్తిత్వంతో రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా తన నిరాడంబరతను ఆయన అడుగడుగునా చాటారు. పదవీకాలంలో ఆయనపై ఆరోపణలేవీ లేవు. వివాదరహితుడిగా పేరుగాంచారు. "సామాన్యుడిగానే రాష్ట్రపతి భవన్ కు వచ్చాను, సామాన్యుడిగానే వెళ్లిపోతున్నాను" అంటూ పదవీకాలం ముగిసిన పిమ్మట కలాం పేర్కొన్నారు. ప్రతిభా పాటిల్ విషయం అందుకు భిన్నం. రాష్ట్రపతిగా ఆమె పనిచేసిన కాలంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. విదేశీ ప్రయాణాల పేరిట కోట్లాది రూపాయలు దుబారా చేశారని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది కూడా. తాజాగా, ప్రతిభా పాటిల్ మరోసారి వార్తల్లోకెక్కారు. మాజీ రాష్ట్రపతులకు వాహనం సహా ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. వాటిలో భాగంగా... సొంత వాహనంతో సరిపెట్టుకోవాలని భావిస్తే పెట్రోల్ ఖర్చులిస్తారు, ప్రభుత్వ వాహనం ఇవ్వరు. కానీ, ప్రతిభ మాత్రం తనకు ప్రభుత్వ వాహనం కావాలని, అదే సమయంలో సొంత వాహనం ఉపయోగించుకునేందుకూ అనుమతించాలని, పెట్రోల్ అలవెన్స్ సౌకర్యం కల్పించాలని అంటున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. స్వస్థలం పుణేలో సొంత వాహనం ఉపయోగిస్తానని, సిటీ బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేయాలని ప్రతిభ కేంద్రాన్ని కోరారు. కానీ, అధికారులు మాత్రం కుదరదంటున్నారు. ప్రభుత్వ వాహనంతో పాటు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వడం వీలుకాదని తెలిపారు.