: రూ. 6,300 కోట్ల పెట్టుబడి, 10 కొత్త మోడల్స్, 12 వేల మందికి ఉపాధి
ఇండియాలో విస్తరించాలన్న ఉద్దేశంతో జనరల్ మోటార్స్ (జీఎం) భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,300 కోట్లు)తో ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారీ బర్రా బుధవారం నాడు వివరించారు. ఈ ప్లాంట్లలో 12 వేల మందికి పైగా ఉపాధిని పొందుతారని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 10 కొత్త మోడల్ కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. షాంగై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తో సైతం డీల్ కుదుర్చుకున్నామని వెల్లడించిన ఆయన, చైనాలో సైతం సత్తా చాటుతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చవర్లెట్ బ్రాండ్ విస్తరణకు 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు వివరించారు. 2020 నాటికి ఇండియాలో జీఎం వాటాను రెట్టింపు చేసుకోవాలన్నదే తమ తొలి లక్ష్యమని తెలిపారు. కాగా, 2014లో జీఎం 56 వేల వాహన యూనిట్లను భారత్ లో విక్రయించింది. మొత్తం అమ్ముడైన వాహనాల సంఖ్యలో ఇది 1.8 శాతానికి సమానం.