: మరణించి కూడా గర్జిస్తున్న జింబాబ్వే సింహం!


సిసిల్... జింబాబ్వేలోని హవాంగే నేషనల్ పార్కులో వేలాది మందిని ఆకర్షించిన సింహం. 13 సంవత్సరాల ఈ సింహాన్ని వేటాడేందుకు ఓ అమెరికన్ బడాబాబు 50 వేల డాలర్లు చెల్లించి పార్కులోకి వెళ్లాడు. ఓ బాణం దానిపై వదిలాడు. ఆ బాధను అనుభవిస్తూ, 40 గంటల పాటు నరకయాతన అనుభవించింది సిసిల్. అప్పటికీ దాని ప్రాణాలు పోలేదు. పార్కు అధికారులు సిసిల్ కోసం వెతికి, గాయపడ్డ సింహాన్ని చూసి, తుపాకీతో కాల్చి చంపి సులువైన మరణాన్ని ప్రసాదించారు. అమెరికాలో డెంటిస్టుగా పనిచేస్తున్న వాల్టర్ జేమ్స్ పామర్ అనే మిలియనీర్, ఈ దయారహిత పనికి ఒడిగట్టాడు. ఇప్పుడు సిసిల్ సామాజిక మాధ్యమాల రూపంలో వాల్టర్ పై గర్జిస్తోంది. తనను చంపిన పామర్ పై విమర్శలు గుప్తిస్తోంది. పామర్ చేసింది ఎంతటి తప్పో నెటిజన్ల వేళ్ల మీదుగా చెప్పిస్తోంది. ఇంతటి దుర్మార్గుడు ఓ అమెరికన్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామని ఎంతో మంది వ్యాఖ్యానించారు. చంపడాన్ని థ్రిల్ గా తీసుకున్న పామర్ కు శిక్ష పడాల్సిందేనని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 'సిసిల్ ది లయన్' పేరిట హాష్ ట్యాగ్ ఏర్పాటు కాగా, లక్షకు పైగా ట్వీట్లు పామర్ కు వ్యతిరేకంగా వచ్చాయి. సిసిల్ కు పుట్టిన పిల్లలు ఇంకా దాని సంరక్షణలోనే ఉన్నాయని తెలుసుకున్న తరువాత ట్వీట్ల తీవ్రత మరింతగా పెరిగింది. మిన్నెపోలిస్ లో ఆయన డెంటల్ డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్న క్లినిక్ ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. సిసిల్ చిత్రాలు, దానికి నివాళిగా పూలు ఉంచి నిరసన కారుల నినాదాలకు క్లినిక్ మూతపడింది. ఆయనపై కేసు పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మరణించి కూడా గర్జిస్తున్న సిసిల్ పామర్ జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో వేచి చూడాలి. కాగా, మిన్నెసోటాలో ఈ పెద్దమనిషి అనుభవమున్న వేటగాడట. గతంలో వేటలో ట్రోఫీలను కూడా గెలుచుకున్నాడట. వేట పేరిట మూగ జీవాలను చంపిన పాపం ఇప్పుడు తగులుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News