: ఏపీలోని మూడు విశ్వవిద్యాలయాల్లో జపనీస్ బోధనకు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని మూడు విశ్వవిద్యాలయాల్లో జపనీస్ భాష బోధనను అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. జపాన్ ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేటు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి. అటు ఏపీ నూతన రాజధానిలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి జపాన్ భాష కూడా తెలిసి ఉన్న వారికైతే అవకాశాలుంటాయని, అందుకే జపనీస్ నేర్పించాలని సర్కారు నిర్ణయించిందని సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. జపాన్ కంపెనీలతో పనిచేసేందుకు వీలుగా జపనీస్, తెలుగు, ఆంగ్ల భాషలు తెలిసినవారికి మరింత డిమాండ్ ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలలో జపాన్ భాషకు సంబంధించి తరగతులు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డికి అప్పగించింది.