: ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ చేస్తున్నారా? మీ జుట్టు ఊడిపోవడం ఖాయం!
మీరు ఇంటి నుంచి ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం తెచ్చుకుని ఆఫీసుల్లో మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారా? ఒకసారి మీ జుట్టు చూసుకోండి... ఎందుకంటే, ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనాలు చేస్తున్న వారికి మిగతావారితో పోలిస్తే జుట్టు వేగంగా ఊడిపోతోందట. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ అనే రీసెర్చ్ సెంటర్, సుమారు ఒక సంవత్సరం పాటు 430 మంది యువతులు, 570 మంది పురుషులపై అధ్యయనం చేసి కనుగొంది. హెయిర్ లాస్ సమస్యతో చికిత్సలకు వస్తున్న వారిలో 92 శాతం మంది రక్తం, మూత్రం శాంపిళ్లలో ప్లాస్టిక్ (బీపీఏ-బిస్పెనాల్ ఏ) అధికంగా ఉన్నట్టు ఈ రీసెర్చ్ లో వెల్లడైంది. బీపీఏను కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడతారు. ఈ అధ్యయనంలో భాగంగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న ఉద్యోగులను ఎంచుకుని ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని తెచ్చుకుని తినేవారిపై పరిశోధనలు చేశారు. సుమారు 70 శాతం మెటబాలిక్ వ్యాధులు జుట్టు రాలిపోవడంతోనే ప్రారంభమవుతున్నాయని కూడా రీసెర్చ్ లో భాగంగా కనుగొన్నట్టు హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈఓ బనీ ఆనంద్ వివరించారు. ప్లాస్టిక్ పాత్రలు, ఆహారపు అలవాట్లు రక్తంలో బీపీఏ పెరిగేందుకు కారణమవుతున్నాయని, ముఖ్యంగా చిన్నారుల టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్ తో తయారు చేసినవి కావడం వారిలో సమస్యలను పెంచుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ల నుంచి పాల ప్యాకెట్లు, ఫుడ్ కంటెయినర్లు, వాటర్ బాటిళ్ల వాడకం తగ్గకపోవడం పలు సమస్యలకు దారితీస్తోందని బనీ వివరించారు. మైక్రోవేవ్ ఓవెన్లను వాడటం ద్వారా శరీరంలోకి మరింత ప్లాస్టిక్ చేరుతోందని అపోలో హాస్పిటల్ క్లినికల్ డైటీషియన్ చీఫ్ ప్రియాంకా రోహత్గి అభిప్రాయపడ్డారు. సూర్యరశ్మిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఉంచడం వల్ల అవి నిదానంగానైనా కరిగిపోతూ, తాగే నీటిలోకి ప్లాస్టిక్ ఆనవాళ్లను పంపుతున్నాయని, వీటి స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ ప్రొడక్టులను వాడాలని ఆమె సలహా ఇస్తున్నారు.