: చట్ట వ్యతిరేకంగా వెళితేనే న్యాయం... సుప్రీం ముందు సవాలుగా నిలిచిన కేసు!
ఓ అత్యాచార బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్ సుప్రీం ధర్మాసనం ముందు పెను సవాలును నిలిపింది. 14 సంవత్సరాల తన కుమార్తె గర్భవతని, ఆమెకు అబార్షన్ చేయించేందుకు అనుమతించాలని సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఏఆర్ డావె, కురియన్ జోసఫ్ ల బెంచ్, చట్టానికి వ్యతిరేకంగా వెళ్తేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డప్పటికీ, అందుకు సమ్మతిని మాత్రం చెప్పలేదు. ప్రెగ్నెన్సీ చట్టం నిబంధనల ప్రకారం 20 వారాల లోపు గర్భవతులకే అబార్షన్ చేయవచ్చు. కానీ బాధితురాలు 24 వారాల గర్భవతిగా ఉండడం, దీనికితోడు ఆమె వయసు 14 సంవత్సరాలే కావడంతో, ఏం చేయాలో పాలుపోని ధర్మాసనం, కేసును ప్రత్యేక డాక్టర్ల బృందానికి అప్పగించింది. ఆమెకు సర్జరీ చేయడం ద్వారా గర్భాన్ని తొలగించవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని, అందుకు అనుమతి లభిస్తుందా? అని గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల బృందాన్ని ప్రశ్నించింది. కాగా, అంతకుముందు ఇదే కేసులో వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు అబార్షన్ చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు జూలై 23న నిరాకరించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును మైనర్ బాధితురాలి తండ్రి కామినీ జైస్వాల్ సుప్రీంలో సవాలు చేయగా, ఇద్దరు సీనియర్ డాక్టర్లకు బాలికను పరీక్షించాలని ఆదేశించింది. ప్రాణాపాయం లేకుండా గర్భం తొలగించవచ్చని డాక్టర్లు భావిస్తే, గర్భవిచ్ఛితికి ఆదేశాలిస్తామని కూడా బెంచ్ స్పష్టం చేసింది. ఇదే జరిగితే భారత చరిత్రలో ఈ తరహా తీర్పు మొట్టమొదటిదిగా నిలుస్తుంది. ఒకవేళ అబార్షన్ చేయాల్సి వస్తే పిండానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, తద్వారా నిందితుడికి వ్యతిరేకంగా గట్టి సాక్ష్యం లభించినట్లవుతుందని కూడా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.