: పంజాబ్ లో నేటికీ కాలం చెల్లిన తుపాకులే దిక్కు... ప్రకాశ్ సింగ్ బాదల్ ఆవేదన


ముష్కరులకు అడ్డాగా మారిన పాకిస్థాన్ కు సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్ లో నేటికి కాలం చెల్లిన ఆయుధాలే ఉన్నాయట. వీటితోనే ఆ రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదులపై పోరు సాగిస్తున్నారట. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా నేలకొరిగిన డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ భౌతిక కాయానికి కొద్దిసేపటి క్రితం బాదల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలం చెల్లిన తుపాకులతో తమ పోలీసులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారని చెప్పారు. ‘‘చాలా కాలం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు లేవు. యుద్ధ సమయంలో ధరించేందుకు హెల్మెట్లు కూడా లేవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశానని కూడా బాదల్ చెప్పారు.

  • Loading...

More Telugu News