: 1.7 సెకన్లలో 100 కి.మీ వేగం... విద్యార్థులు తయారుచేసిన ఎలక్ట్రిక్ కారు ఘనత!
1.7 సెకన్లలో ఎన్ని పనులు చేయవచ్చు? టపటపా ఓ ఆరేడుసార్లు కను రెప్పలు ఆర్పవచ్చు. నడిస్తే... ఓ నాలుగడుగులు వేయవచ్చు. ఒకసారి ఊపిరి పీల్చడం లేదా ఊపిరిని బయటకు వదలడం చేయవచ్చు. కానీ యూనివర్శిటీ ఆఫ్ స్టట్ గార్డ్ విద్యార్థులు ఏం చేశారో తెలుసా? 1.7 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకునే కారును తయారు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగమైన కారు ఇదే. 'గ్రీన్ టీమ్ ఫార్ములా' పేరిట గ్రూప్ గా ఏర్పడ్డ విద్యార్థులు 100 కి.మీ. వేగాన్ని 1.779 సెకన్లలో సాధించి సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న రికార్డుతో పోలిస్తే ఇది 0.006 సెకన్లు తక్కువ. అయితే, ఇది పెట్రోలుతో నడిచే కారు కాదు. ఎలక్ట్రిక్ వెహికిల్ కావడమే ప్రపంచ ఆటో ఇండస్ట్రీని ఆకర్షించింది. 134 బీహెచ్ పీ పవర్డ్ బ్యాటరీని ఇందులో వాడారు. 6.62 కిలో వాట్ బ్యాటరీతో శరవేగంగా తిరిగే నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు వాడారు. ఈ విద్యార్థులు సాధించిన ఘనరికార్డును త్వరలోనే గిన్నిస్ బుక్ అధికారికంగా ప్రకటించనుంది.