: తెలుగు రాష్ట్రాల ఎంపీలను కలాం కలిపేశారు!... కలాంకు ‘ఉమ్మడి’ నివాళి
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నాటి నుంచి ఉమ్మడి ఏపీ ఎంపీలంతా ప్రాంతాల వారీగా విడిపోయారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ అంతరం మరింత పెరిగిపోయింది. ఒకరి వాదనను మరొకరు తిప్పికొడుతూ పార్లమెంటులో వైరివర్గాలుగా కొనసాగుతున్నారు. అయితే నిన్న మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఒకే జట్టుగా కలిసిపోయారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళి అర్పించేందుకు ఏపీ, తెలంగాణ ఎంపీలు ఒకే వేదిక మీదకు వచ్చారు. కలిసికట్టుగా కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ అరుదైన దృశ్యం నిన్న ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్రాల భవన్ గా కొనసాగుతున్న ఏపీ భవన్ లో కనిపించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కంభంపాటి రామ్మోహన్ రావు, వేణుగోపాలాచారి లు కూడా పాలుపంచుకున్నారు.