: కలాం సారథ్యం లేకే రాకెట్ కూలిపోయింది... ఇందిరా గాంధీ వ్యాఖ్య!
భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా ఎంతటి ప్రావీణ్యాన్ని సాధించారో తెలిపే మరో ఘటన వెలుగు చూసింది. పీటీఐలో విలేకరిగా పనిచేసి రిటైర్ అయిన నిశాత్ అహ్మద్ ఈ మేరకు నిన్న ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. భారత ప్రధాని హోదాలో దివంగత ఇందిరా గాంధీ శ్రీహరికోటలో జరిగిన ఓ రాకెట్ ప్రయోగానికి హాజరయ్యారు. అయితే సదరు రాకెట్ ప్రయోగం విఫలమైంది. నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ ఆసక్తికర వ్యాఖ్య చేశారట. ‘‘ఈ ప్రయోగం విఫలమవడంలో విశేషమేముంది? కలాం సారథ్యం లేకే రాకెట్ కూలిపోయింది’’ అని వ్యాఖ్యానించారట. నాటి ఇందిరాగాంధీ వ్యాఖ్యలను కలాం మరణం నేపథ్యంలో మరోసారి గుర్తు చేసుకున్న నిషాత్ అహ్మద్, అవే వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.