: చిత్తూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ... మూడిళ్లను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది. సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో జరిగిన ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. మూడిళ్లను ధ్వంసం చేశారు. జిల్లాలోని ఏర్పేడు మండలం పెనుమళ్లంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ఇసుక తవ్వకాలే కారణమని తెలుస్తోంది. తమ పొలాల వద్ద ఇసుక తవ్వకాలు జరపడం కుదరదని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ధ్వంసరచనకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కానట్లు తెలుస్తోంది.