: నేడు రామేశ్వరానికి కలాం భౌతిక కాయం... వెంట వెళ్లనున్న వెంకయ్య, పారికర్
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం నేడు ఆయన సొంతూరు రామేశ్వరానికి తరలిపోనుంది. మొన్న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన ఆయన అక్కడి బెథాని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం ఆయన పార్థివ దేహాన్ని వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇక కలాం భౌతిక కాయానికి ఆయన సొంతూరు రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిన్నటి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లో ఉన్న కలాం భౌతిక కాయాన్ని నేడు రామేశ్వరం తరలించనున్నారు. కలాం పార్థివ దేహం వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లు నేడు రామేశ్వరం వెళ్లనున్నారు. ఇక రేపు జరగనున్న అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.