: వరంగల్ ఉపఎన్నికకు బలమైన అభ్యర్థిని ప్రకటిస్తాం: తమ్మినేని
వరంగల్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టాలని తెలంగాణ వామపక్ష కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఉపఎన్నికకు తమ కూటమి నుంచి బలమైన నేతను అభ్యర్థిగా ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వరంగల్ జిల్లా జనగాంలో తెలంగాణ రైతుల సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఎసిరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు సీపీఎం ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే నాడు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో ప్రజలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగిందన్నారు. సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.