: హైదరాబాదులో మరో 'ప్రత్యూష'
కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన ప్రత్యూష ఉదంతం ఎందరినో కదిలించింది. ఆమె పరిస్థితి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి వ్యక్తే చలించిపోయారు. 'ప్రత్యూష' తరహా ఉదంతమే హైదరాబాదులో మరొకటి చోటుచేసుకుంది. తాజాగా, చర్లపల్లి రైల్ విహార్ కాలనీలో స్వప్న(17) అనే బాలికకు పోలీసులు విముక్తి కలిగించారు. వివరాల్లోకెళితే... స్వప్న తండ్రి బెనర్జీ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె స్వప్న పట్ల కఠినంగా వ్యవహరించేది. బెనర్జీ ఇంట్లోలేని సమయంలో లక్ష్మి తనలోని పైశాచికత్వాన్ని స్వప్నపై చూపేది. స్వప్నను చిత్రహింసలు పెట్టడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న రైల్ విహార్ కాలనీ వాసులు బాలల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ బాలికను బయటికి తీసుకుని వచ్చి, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సవతి తల్లి లక్ష్మిపై కేసు నమోదు చేశారు.