: కలాం జీవించి ఉండగానే ఆమధ్య అంజలి ఘటించిన మహిళా మంత్రి... నాటి ఘటన యాదృచ్ఛికమేనా?
భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవించి ఉండగానే ఆయన ఫొటోకు జార్ఖండ్ రాష్ట్ర మహిళా మంత్రి నీరా యాదవ్ దండ వేసి, బొట్టు పెట్టి, అంజలి ఘటించిన వార్త ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. రాంచీలోని ఓ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన ఈ చర్యకు పక్కనున్న వారంతా అవాక్కయ్యారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ సమక్షంలోనే ఇది జరిగింది. ఇది తెలియక జరిగిందో లేక యాదృచ్ఛికంగా జరిగిందో కానీ... ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే అబ్దుల్ కలాం తన తుది శ్వాస విడిచారు. మన సెంటిమెంటు ప్రకారం, మామూలుగా ఎవరైనా బతికుండగానే మరణించారన్న పుకారు వస్తే 'కీడు' పోతుందని కొందరు అంటుంటారు. కానీ, కలాం విషయంలో అలా జరగలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే 127 కోట్ల మంది భారతీయులను బాధాతప్తులను చేస్తూ, ఆ మహోన్నత వ్యక్తి తనువు చాలించారు. ఇప్పుడు ఆయన ఫోటోలకు నిజంగానే దండలేసి అంజలి ఘటించ వలసి రావడం విచారకరం!