: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడినవారికి ట్రాఫిక్ విధులు అప్పగింత
మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. మందుకొట్టి, స్టీరింగ్ పట్టుకుని అభాగ్యుల ప్రాణాలను గాల్లో కలిపేయడమే కాకుండా, తాము సైతం ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే హైదరాబాదులో డ్రంకన్ డ్రైవ్ పక్కాగా చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అలా దొరికిన మందుబాబులకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధించిందో చూడండి! మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలని మందుబాబులను ఆదేశించింది. హైదరాబాదులో ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ ప్రత్యేక విధులు నిర్వర్తించక తప్పదని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఫైన్ కట్టేసి ఊపిరిపీల్చుకుంటున్న బడాబాబులకు ఎర్రమంజిల్ కోర్టు నిర్ణయం రుచించికపోవచ్చు! తాజాగా, ఎర్రమంజిల్ కోర్టు 35 మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవా శిక్ష విధించడం చర్చనీయాంశం అయింది.