: కలాంకు అమెరికా ఘన నివాళి... ప్రత్యేక కథనాలు రాసిన అగ్రరాజ్య పత్రికలు
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతిపై అగ్రరాజ్యం అమెరికా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. భారత్ ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కలాందే కీలక భూమిక అని ఆ దేశ పత్రికలు పేర్కొన్నాయి. ఈ మేరకు నిన్న మరణించిన కలాంను గుర్తు చేసుకుంటూ ఆ దేశ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. అణ్వస్త్ర, అంతరిక్ష రంగాల్లో భారత్ అభివృద్దికి కలాం విశేష సేవలందించారని తమ కథనాల్లో పేర్కొన్నాయి. రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదగడానికి కలాం అవిశ్రాంత కృషి చేశారని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. పృథ్వీ, అగ్ని లాంటి క్షిపణులను రూపొందించడం ద్వారా భారత రక్షణ వ్యవస్థను కలాం పటిష్ఠం చేశారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. భారత అంతరిక్ష, రక్షణ రంగాల పటిష్ఠతకు కలాం ఎనలేని సేవలు చేశారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.