: మంచి ఆత్మీయుడిని కోల్పోయా... నిజమైన భారతరత్న కలాం: చంద్రబాబు


భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా తనకు అత్యంత ఆప్తుడైన కలాంను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. కలాం చిన్నతనంలో ఆయన గురువు ఒక పక్షి బొమ్మ వేసి... ఈ పక్షిలా ఆకాశమంత ఎత్తుకు వెళ్లాలని కలాంకు మార్గనిర్దేశం చేశారని, తన గురువు చెప్పినట్టే ఆయన ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. విజయమే తప్ప ఓటమి ఎరుగని మహోన్నత వ్యక్తి కలాం అని కొనియాడారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తదుపరి రాష్ట్రపతిగా ఎవర్ని ఎంపిక చేయాలి? అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారు? అని కేంద్రం ఆలోచిస్తున్న తరుణంలో... అప్పటి ప్రధాని వాజ్ పేయికి కలాం పేరును తాను సూచించానని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టి, ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి కలాం అని చెప్పారు. తాను చనిపోతే సెలవు ప్రకటించకండి... వీలైతే మరో రోజు ఎక్కువ పనిచేయండని కలాం చెప్పారని గుర్తుచేసుకున్నారు. నీతి, నిజాయతీ, పట్టుదలే కలాం పెట్టుబడి అని తెలిపారు. అలిపిరి ఘటనలో తాను గాయపడినప్పుడు, రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ తనను పరామర్శించడానికి కలాం వచ్చారని... ఆ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. భారతరత్నగా గౌరవాన్ని అందుకున్న కలాం నిజమైన భారతరత్నగా దేశానికి సేవలందించారని కీర్తించారు. అబ్దుల్ కలాం లేకపోవడం తనకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని మనస్పూర్థిగా వేడుకుంటున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News