: రాహుల్ పర్యటన విజయవంతమైంది... కాంగ్రెస్ కు బలాన్నిచ్చింది: రఘువీరా
అనంతపురం జిల్లాలో తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ పర్యటన ఏపీలో పార్టీకి బలాన్నిచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. ఇక పర్యటన కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే అనంతపురం జిల్లా ప్రజలు కూడా రాహుల్ ను ఆదరించారని, మీడియా కూడా బాగా మద్దతిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరా మాట్లాడారు. ప్రత్యేకహోదాపై పోరాడతానని రాహుల్ చెప్పడం ద్వారా ప్రజలకు ఓ భరోసా వచ్చిందని పేర్కొన్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలపై పోరాటానికి కూడా ఆయన భరోసా ఇచ్చారన్నారు. ఇక ప్రత్యేక హోదాపై అన్ని వర్గాలు సమాయత్తం కావాలని, రాహుల్ ఇచ్చిన స్పూర్తి ఇందుకు బాగా ఉపయోగపడుతుందని రఘువీరా అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణాన్ని ఇతర దేశాలకు అప్పగించడం వల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని, ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనను హత్యలుగా భావిస్తున్నామని, దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.