: మంత్రి నారాయణను కలవడానికి నాకే ఐదు రోజులు పట్టింది: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆయనను కలవడానికి ప్రయత్నించిన తనకు ఐదు రోజుల సమయం పట్టిందని చెప్పారు. విశాఖలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మంత్రి నుంచి స్పందన లేదని, ఫోన్ ఎప్పుడూ బీజీ అనే వస్తోందని తెలిపారు. దాంతో చేసేదిలేక తాను రాజమండ్రి వెళ్లానన్నారు. అక్కడ ఆయన గన్ మెన్ తనను ఆపడంతో బతిమిలాడి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. శాసనసభలో బీజేపీ పక్ష నేత అయిన తనకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల సంగతేమిటని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. నారాయణగారు బిజీ అయితే అయ్యుండొచ్చు, పుష్కరాలలో మునిగి ఉండవచ్చు... అయినా ఖాళీ సమయం ఉన్నప్పుడైనా స్పందించరా? అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ తప్పకుండా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు.