: మోదీ ఓ కాలనాగు... దాన్ని నలిపేస్తా: లాలూ
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఓ కాలనాగులాంటివాడు... దాన్ని నలిపేస్తా అంటూ ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ, తాను శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన గడ్డకు చెందిన వాడను అంటూ యాదవ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై లాలూ తనదైన శైలిలో స్పందిస్తూ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. "కాలనాగును శ్రీకృష్ణుడు తన చిన్న తనంలోనే అంతమొందించాడు. ఇప్పుడు మోదీ రూపంలో కాలనాగు పుట్టింది. అది బీహార్ మొత్తాన్ని కాటేయాలని చూస్తోంది. మన యాదవులంతా ఏకమై ఆ కాలనాగును అంతమొందించాలి. బీజేపీని కూకటివేళ్లతో పీకివేయాలి" అంటూ పిలుపునిచ్చారు. తనకు, నితీష్ కుమార్ కు అభిప్రాయ భేదాలు ఉన్నట్టు బీజేపీ ప్రచారం చేస్తోందని... ఇదంతా తప్పుడు ప్రచారమే అని చెప్పారు.