: 13 రోజుల తర్వాత హైదరాబాదులో కాలిడిన చంద్రబాబు... ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని 13 రోజుల పాటు రాజమండ్రిలోనే మకాం పెట్టారు. పుష్కరాల తొలిరోజుననే ప్రమాదం జరగడంతో ఆ మహా క్రతువు ముగిసేదాకా రాజమండ్రి వదిలివెళ్లేది లేదని ప్రకటించిన చంద్రబాబు, ఆ మేరకు అక్కడే ఉండిపోయారు. దగ్గరుండి పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాత్రీ పగలనే తేడా లేకుండా స్వయంగా కార్యరంగంలోకి దిగిన ఆయన అన్నీ తానై వ్యవహరించారు. మొన్న పుష్కరాలు ముగిశాయి. పుష్కరాల్లో మెరుగ్గా పనిచేసిన అధికారులను నిన్న ఘనంగా సత్కరించిన ఆయన సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, ప్రకాశ్ గౌడ్, ఆరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, వివేకానంద తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.