: ఏపీ సీఎంఓ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు... అధికారుల పనితీరే కారణమట!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కార్యాలయ ప్రక్షాళనకు దాదాపుగా సిద్ధపడ్డట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు, త్వరలోనే మొత్తం కార్యాలయాన్నే సమూలంగా ప్రక్షాళన చేయనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. అధికారుల నియామకాలపై ఆయా ఉద్యోగుల సామర్థ్యం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎంఓ కార్యాలయం, అందుకు విరుద్ధంగా ఆయా అధికారుల వ్యక్తిగత ప్రాధామ్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీంతో ఆశించిన మేర సీఎంఓ పనితీరు ఉండట్లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ మేరకు ఏపీ అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇఫ్పటికే ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం కలగగా, మరికొంత మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సమర్థవంతంగా పనిచేసిన యువ ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ సీఎంఓకు రానున్నారని తెలుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో సీఎంఓ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై వాస్తవాలను వెల్లడించడంలో సీఎంఓ అధికారులు విఫలమయ్యారు. వాస్తవానికి పుష్కరాల్లో చంద్రబాబు స్నానం చేసిన ప్రదేశం, ప్రమాదం జరిగిన ప్రదేశానికి దూరంగా ఉందని... ఈ రెండు ప్రాంతాల మధ్య ఓ గోడ కూడా ఉందన్న విషయాన్ని చంద్రబాబు స్వయంగా వెల్లడిస్తే కాని వెలుగులోకి రాలేదు. అంతేకాక అనంతపురం జిల్లాకు చెందిన ఇన్ పుట్ సబ్సీడీ విడుదల కోసం ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు సహా, మంత్రులు చేసిన వినతులను సీఎంఓ అధికారులు పట్టించుకోలేదట. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్ర షెడ్యూల్ విడుదల కాగానే, సదరు నిధులను ఆగమేఘాల మీద విడుదల చేశారట. దీంతో తనకు భయపడిన క్రమంలోనే ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని జగన్ చెప్పుకున్నారని అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. దీనిపై వారంతా సీఎంఓ అధికారుల తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలో సీఎంఓను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయించుకున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.