: ఆ సిటీలో గోడలతో పెట్టుకోవద్దు... రివర్స్ అవుతుంది!
నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా, అక్కడికెళ్లి మరీ మూత్ర విసర్జన చేసే ఓపిక కొందరికి ఉండదు. ఓపిక ఉన్నా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే వారు మరికొందరు! మొత్తానికి నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన అనేది సాధారణ అంశమైపోయింది. అలాంటి వారికి గోడలు, చెట్లే వేదికలు! అయితే, బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి చెక్ పెట్టేందుకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర పబ్లిక్ వర్క్స్ ఏజెన్సీ ఎలాంటి చర్య తీసుకుందో చూడండి! పైలట్ ప్రాజెక్టు కింద, నగరంలో మూత్రంతో తడిసిముద్దయిపోయే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఏజెన్సీ సిబ్బంది అక్కడి గోడలకు ఓ ప్రత్యేకమైన పెయింట్ వేశారు. ఈ పెయింట్ వేసిన గోడలపై మూత్ర విసర్జన చేస్తే ఆ గోడలు మూత్రాన్ని వికర్షిస్తాయట! దాంతో, ఆ మూత్రం... పోసిన వ్యక్తుల కాళ్లపైనే పడి వాళ్ల ప్యాంటు తడిసిపోవడం ఖాయమని ఏజెన్సీ భావిస్తోంది. ఆ పెయింట్ ప్రత్యేక లక్షణం కారణంగానే ఇలా జరుగుతుందని శాన్ ఫ్రాన్సిస్కో నగర పబ్లిక్ వర్క్స్ ఏజెన్సీ డైరక్టర్ మహ్మద్ నూరు తెలిపారు. జర్మనీలోని హాంబర్గ్ నగరంలో ఈ రకం పెయింట్ వాడారన్న విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో చదివారు. అల్ట్రాటెక్ ఇంటర్నేషనల్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థ తయారుచేసిన ఆ హైటెక్ పెయింట్ పేరు అల్ట్రా ఎవర్ డ్రై పెయింట్. ఈ పెయింట్ వేసిన గోడలపై మూత్ర విసర్జన చేసినవారు మరోసారి పోయాలంటే తప్పక ఆలోచిస్తారని శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ వర్క్స్ ఏజెన్సీ ప్రతినిధి రాచెల్ గోర్డాన్ తెలిపారు.