: సల్మాన్ ను తండ్రి సైతం విమర్శించినా ఆయన మాత్రం మద్దతిచ్చాడు!
ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఉరికంబం ఎక్కబోతున్న యాకూబ్ మెమన్ పై బాలీవుడ్ సల్మాన్ ఖాన్ జాలి చూపడాన్ని ఎంతోమంది తీవ్రంగా విమర్శించారు. చివరికి సల్మాన్ తండ్రి సలీం ఖాన్ సైతం కుమారుడి ట్వీట్లను తప్పుబట్టారు. ఇక, చేసేదేమీలేక సల్మాన్ తన ట్వీట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సల్మాన్ కు మద్దతుగా మాట్లాడారు సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా. ఎవరి క్షమాభిక్ష పిటిషన్ నైనా సమర్థించడం తప్పేమీ కాదని అన్నారు. సల్మాన్ ఖాన్ తనకు ఎప్పటినుంచో తెలుసని, అతడో మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. యాకూబ్ విషయంలో సల్మాన్ తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. క్షమాభిక్ష పిటిషన్ ను సమర్థిస్తూ మాట్లాడడం హానికరం కాదని తెలిపారు. ఇక, సల్మాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయిజాన్' అద్భుతంగా ఉందన్నారు. తాను చూశానని, ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమని కొనియాడారు.