: గ్రేట్.. ఫెంటాస్టిక్... అంటూ కోహ్లీ నిర్ణయాన్ని కొనియాడిన ద్రావిడ్


బ్యాటింగ్ లెజెండ్, ఇండియా-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నాడు. శ్రీలంకతో కీలక సిరీస్ కు ముందు సన్నద్ధత కోసం ఇండియా-ఎ జట్టు తరపున ఆడాలని కోహ్లీ నిర్ణయించుకోవడాన్ని ద్రావిడ్ ప్రశంసించాడు. "అది గొప్ప నిర్ణయం. అద్భుతమైన నిర్ణయం. మూడు వారాల కిందట కోహ్లీ నాతో మాట్లాడాడు. ఆసీస్-ఎ జట్టుతో సిరీస్ సందర్భంగా కనీసం ఒక మ్యాచ్ లోనైనా ఆడే చాన్స్ ఇవ్వాలని కోరాడు. శ్రీలంక టూర్ కోసం తనను తాను సిద్ధం చేసుకోవాలన్న తపన అతడిలో కనిపిస్తోంది. ఆట పట్ల అతడి అనురక్తికి ఇది నిదర్శనం. మరింత మ్యాచ్ ప్రాక్టీసు ఉంటే లంకతో సిరీస్ లో రాణించగలనన్న ఉద్దేశంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇండియా-ఎ జట్టులో సీనియర్ జట్టు కెప్టెన్ ఉండడం హర్షణీయం. కోహ్లీని ఆకట్టుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశమని భావిస్తున్నా. కోహ్లీ ముందే తమ ప్రతిభను చాటుకునే మెరుగైన అవకాశం వారి ముందు నిలిచింది" అని ద్రావిడ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆసీస్-ఎ జట్టుతో ఇండియా-ఎ జట్టు అనధికార టెస్టు సిరీస్ ఆడుతోంది.

  • Loading...

More Telugu News