: తత్కాల్, వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు శుభవార్త!
పండుగ సీజన్లలో రైలు ప్రయాణం అంటే ఎంత ప్రయాసో తెలియంది కాదు. ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోకపోతే ఇక ప్రయాణం మాట మర్చిపోవాల్సిందే. తత్కాల్ విధానంలో టికెట్లు తీసుకున్నా ఒక్కోసారి ప్రయాణం రసాభాసగా మారుతుంది. ఇక వెయిటింగ్ లిస్టులో పేర్లున్న వారైతే అర్జెంటుగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తారు. ఇప్పుడలాంటి సమస్యలన్నింటిని మర్చిపోండని రైల్వే శాఖ భరోసా ఇస్తోంది! ఇకపై తత్కాల్, వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ళను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను పట్టాలెక్కించేదుకు ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. ఈమేరకు ప్రతిపాదనలను రైల్వే మంత్రి ముందుంచామని జాతీయ రైల్వే బోర్డు సభ్యుడు సుబోధ్ జైన్ వెల్లడించారు. డిమాండ్ కు అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్ళను 15-18 కంపార్ట్ మెంట్లతో నడపాలని భారతీయ రైల్వే భావిస్తోంది.