: గోల్డ్ బాండ్లను జారీ చేయనున్న కేంద్రం!
గోల్డ్ బాండ్లను విడుదల చేయడం ద్వారా సుమారు రూ. 15 వేల కోట్లను ఖజానాకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా బంగారం ధరలు పతనం కావడంతో, డిమాండ్ పెరిగిందని, అందువల్ల 'సావరిన్ గోల్డ్ బాండ్ల' జారీ నిమిత్తం క్యాబినెట్ అనుమతులు కోరనున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరో నెల రోజుల్లో ఈ స్కీం గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. క్యాబినెట్ అనుమతులు వచ్చిన తరువాత మార్చిలోగా బాండ్లను జారీ చేసి రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. ఇందులో భాగంగా 300 టన్నుల బంగారు కడ్డీలను డీమ్యాట్ గోల్డ్ బాండ్ల రూపంలోకి మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా రూ. 6 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో భాగంగా, గోల్డ్ బాండ్ల జారీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.