: జాహ్నవికి బెయిలిచ్చేందుకు నిరాకరించిన కోర్టు
బాధ్యతాయుతమైన న్యాయవాది వృత్తిలో ఉండి, మోతాదుకు మించి మద్యం సేవించడమే కాకుండా, కారును రాంగ్ రూటులో నడిపి ఇద్దరి మృతికి కారణమైన ముంబై లాయర్ జాహ్నవి గడ్కరీకి బెయిలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ఆమెపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి బెయిలిచ్చేందుకు నిరాకరించారు. అంతకుముందు జాహ్నవి తరపు న్యాయవాది వాదిస్తూ, ఈ కేసులో విచారణ పూర్తయింది కాబట్టి బెయిలివ్వాలని కోరారు. కాగా, జూన్ 10న పరిమిత మోతాదుకు మూడు రెట్లకు పైగా మద్యం తాగిన జాహ్నవి, ఆడీ కారులో మితిమీరిన వేగంతో దూసుకొచ్చి ఓ టాక్సీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సయ్యద్ హుస్సేన్, మహ్మద్ సలీం అనే ఇద్దరు మరణించారు. జాహ్నవిపై ఆరోపణలు ప్రూవ్ అయితే, ఆమెకు 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.