: 30 శాతం మంది లాయర్లవి నకిలీ పట్టాలు, 20 శాతం మందికి అసలు పట్టాలే లేవు!
మనదేశంలో సుమారు 30 శాతం మంది లాయర్లు నకిలీ పట్టాలతోనే ప్రాక్టీస్ చేస్తున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మానన్ కుమార్ తెలిపారు. చెన్నైలో బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మెగా లాయర్ల శిబిరంలో ఆయన మాట్లాడుతూ, 20 శాతం మందికి కనీసం పట్టాలు కూడా లేవని అన్నారు. తప్పు చేసిన లాయర్లపై చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉన్న కారణంగా ఇలాంటి లాయర్లందరినీ ఏరివేసే కార్యక్రమం జరుగుతోందని ఆయన తెలిపారు. న్యాయవాద డిగ్రీ చేసి కూడా న్యాయవాద వృత్తి స్వీకరించని వారు, దానిని అవమానించినట్టేనని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలకు ఆందోళనలు చేయడం, కోర్టును బహిష్కరించడం సరికాదని ఆయన లాయర్లకు హితవు పలికారు. కాగా, ఢిల్లీ న్యాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇలాంటి నకిలీ సర్టిఫికేట్ కారణంగానే పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.