: మెమెన్ ఉరితీతకు సర్వం సిద్ధం... కొనసాగుతున్న ఉరి రిహార్సల్స్
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ యాకుబ్ మెమెన్ ఉరితీతకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో యాకుబ్ ను ఉరి తీయనున్నారు. ఉరికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఉరిశిక్ష అమలు చేసే ప్రాంతంలో పైకప్పు లేకపోవడంతో... పైన ఇనుప చువ్వలతో గ్రిల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 22 లక్షలు మంజూరు చేసింది. ఉరికి సంబంధించిన ఏర్పాట్లను మహారాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ మీరా బోర్వాంకర్ పరిశీలించారు. ఉరితీతకు అవసరమైన తాడును బయట నుంచి తెప్పిస్తున్నామని జైలు వర్గాలు తెలిపాయి. మరోవైపు, చివరి అవకాశంగా... క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ గవర్నర్ కు పిటిషన్ పెట్టుకున్నాడు యాకుబ్. అయితే, గతంలోనే క్షమాభిక్ష పిటిషన్ ను గవర్నర్ తిరస్కరించారని రాజ్ భవన్ కు సమాచారం పంపామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మరోవైపు, మెమెన్ ఉరిశిక్షకు సంబంధించిన పిటిషన్ పై ఈ నెల 27న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఏమైనా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మెమెన్ ఉరికంబం ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది