: పాట్నా వేదికపై మోదీ, నితీశ్... ఐఐటీ ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం
బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి ఎదురొడ్డి నిలిచేందుకు ఆ రాష్ట్రంలోని పార్టీలన్నీ మునుపెన్నడూ లేనివిధంగా జట్టు కట్టాయి. బీజేపీ కూడా తన సత్తా చాటేందుకు బరిలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో బీహార్ లో ప్రస్తుతం బీజేపీ, దాని వైరిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సామర్థ్యాలపై ఇరు పక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. అయితే నేటి ఉదయం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. పాట్నా ఐఐటీతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభించేందుకు మోదీ రాగా, ఇందుకోసం ఏర్పాటైన వేదికపై బీహార్ సీఎం హోదాలో నితీశ్ కుమార్, మోదీ పక్కన కూర్చోక తప్పలేదు.